అలరించిన ‘అలెగ్జాండర్’

      సినిమాల్లో విలన్ గా తన హావభావాలతో ఎన్నో పాత్రలను రక్తికట్టించిన జయప్రకాష్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రంగస్థలంపైనున్న మమకారంతో నాటకాలను ప్రదర్శిస్తూ  నాటక రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోన్న జెపి... ఇంకా ఏదో చేయాలనే తపనతో తన విగ్రహానికి సరిపోయేటట్టు ‘అలగ్జాండర్’ అనే పేరుతో సాంఘిక నాటకాన్ని ఎంచుకున్నారు. రచయిత పూసల
సహకారంతో ప్రదర్శించి అందరితో భేష్ అనిపించుకున్నారు. ఏకధాటిగా వందనిమిషాలు రంగస్థలంపై ఒక పాత్ర చేయడం అరుదు. అది రికార్డుకోసం చేస్తున్న ప్రయత్నంలో జయప్రకాష్‌రెడ్డి సఫలీకృతం అయ్యారు. హాస్య నటుడు, విలన్ పాత్రధారిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న టివి జయప్రకాష్‌రెడ్డి జెపి థియేటర్ (హైదరాబాద్) బ్యానర్‌పై అలెగ్జాండర్ సాంఘిక నాటకాన్ని హైదరాబాద్ రవీంధ్రభారతిలో ఆదివారం (6-1-2013) ప్రదర్శించారు. అలెగ్జాండర్ పేరుకు తగ్గట్టు నిండైన విగ్రహంతో జయప్రకాష్ స్టేజిపై పాత్రకు తన ప్రతిభతో జీవం పోశారు. పేరు వినగానే ఇదేదో చారిత్రక నాటకం అనే భ్రమ కలుగుతుంది. అయితే నాటకం సాంఘికం. అదీ ఒకే పాత్రధారుడు స్టేజిపై కన్పిస్తాడు. స్టేజిపై ఒక్కరే ఉంటే దాన్ని ఏకపాత్రాభినయం అంటారు. కాని అందుకు భిన్నంగా నేపధ్యంలో చాలా పాత్రలను సృష్టించి రంగస్థలంపై కన్పించకపోయినా వారితో సంభాషించేటట్టు చేయడం ఈ నాటకంలో అలగ్జాండర్‌గా జయప్రకాశ్ రెడ్డి రక్తికట్టించారు. ఇటువంటి వాటిని తెలుగు నాటక లక్షణాల్లో ‘బాణం ’ అని వ్యవహరిస్తారు. పట్టుదలకు, శౌర్యపరాక్రమాలకు పెట్టింది పేరుగా ఖ్యాతిగాంచిన ఆయన అలెగ్జాండర్ పేరును ఉపయోగించుకుని సాంఘిక నాటకం రూపొందించారు. 

అలెగ్జాండర్ గురించి క్లుప్తంగా ...
        ఆర్మీలో మేజర్‌గా దేశ ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకున్న అలెగ్జాండర్ రిటైరైన తర్వాత సాటివారి సమస్యల పరిష్కారం కోసం బతుకుతుంటారు. భార్య లిజా మృతిచెందినా ఆమె స్మృతులను నెమరువేసుకుంటూ అమెరికాలో స్థిరపడిన కొడుకు తమవద్దకు రమ్మన్నా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పరాయిగడ్డపై అవమానాలు వద్దనుకుని, సొంతగడ్డపై నిజాయితీగా బతకాలనుకుంటాడు. విశ్రాంత జీవితం ఇతరులకు సలహాలు ఇవ్వడం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసి ఆర్తులకు సలహాలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో హెల్ప్‌లైన్‌లో వచ్చే సంభాషణలకు అనుగుణంగా అలగ్జాండర్ హావభావాలు , మధ్యలో సూదుల్లా గుచ్చుకునే వాడియైన మాటలతో నాటకం ఆద్యంతం సభికుల హర్షామోదాలు పొందింది. పట్టుదలకు, ధైర్యసాహసాలకు మారుపేరైన అలెగ్జాండర్ చక్రవర్తి పేరును స్ఫూర్తిగా తీసుకుని రచయిత పూసల ఈ సాంఘిక నాటకం రూపొందించారు. సమాజంలో పలు అంశాలను స్పృశిస్తూ మీడియాపై, పోలీసులపై, రాజకీయ నాయకులపై చెణుకులు, చురకలు అంటిస్తూ నాటకం సాగింది. రచయిత పదునైన సంభాషణలు మంచి టైమింగ్‌తో జయప్రకాష్‌రెడ్డి పలుకుతున్నప్పుడు సభికుల హర్షద్వానాలు మిన్నంటాయి. విదేశాల్లో బిజీ జీవితం గడుపుతూ తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో వారు పడే అవస్థలు, మద్యపానం వల్ల కలిగే కష్టనష్టాలు, రాజకీయ నాయకులు తెరవెనుక చేసే కుట్రలు కుతంత్రాలు, మహిళా సంఘాల రాజకీయాలు, పోలీసులపై సెటైర్లు, చిత్ర విచిత్ర వార్తాకథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ వాటి రేటింగ్ పెంచుకునేందుకు టివి ఛానెళ్లు చేసే ప్రయత్నాలు, మీడియా వల్ల జరిగే అనర్థాలు, అనుమానాలతో విడిపోతున్న కుటుంబాలు, పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రేమికులు, మాతృభాష గొప్పదనం, వీధిబడుల విలువ, మమీ డాడీల సంస్కృతి విడనాడాలని, కళాశాలల్లో ర్యాగింగ్ వంటి పలు సమస్యలకు పరిష్కారం ఈ నాటకంలో చూపించారు. సమకాలీన సామాజిక సమస్యలన్నీ ఈనాటకంలో కనిపించాయి. సాటివారికి సహాయం చేయాలని,  సమస్యలకు సానుభూతి చూపకుండా సమస్యకు పరిష్కారం చూపాలనే చివరి సందేశంతో నాటకం ముగుస్తుంది. సినీ నటులు కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్, రఘుబాబు, భరత్, కొండవలస, రావికొండలరావు, బొమ్మాళీ రవి, సాయికుమార్, సన, సుమ, ఝాన్సీ, తెలంగాణ శకుంతల, రాధాకుమారి వారి స్వరాలతో తెరవెనుక గాత్రధారులై నాటకానికి జీవం పోశారు. తెలుగు రంగస్థల పతాకాన్ని ప్రపంచ నాటక శిఖరాన ఆవిష్కరించానికి చేస్తున్న ప్రయత్నంలో ఏకధాటిగా వంద నిమిషాలు రంగస్థలంపై అలెగ్జాండర్‌గా జయప్రకాష్ నటన అనస్య సామాన్యం.

Comments

Popular posts from this blog

పర్యాయ పదాలు.

నానార్ధములు