తెలుగు భాష... ఘోష...
- తెలకపల్లి రవి
Sat, 22 Dec 2012, IST
'తేట తేట తెలుగులా.. తెల్లవారి
వెలుగులా..' అని ఘంటసాల పాడుతుంటే హాయిగా వుంటుంది. పాడనా తెలుగు పాట ఓహౌ
అనిపిస్తుంది. తేనెకన్నా తియ్యనిది తెలుగు పాట..వింటుంటే తల వూగిపోతుంది.
తెలుగు'వాడి' గురించిన శ్రీశ్రీ ప్రయోగంలో శ్లేష ఓహౌ అనిపిస్తుంది...
ఇంకాస్త
వెనక్కు వెళితే గురజాడ.. ఆ వెనక వేమన్న.. ఆ వెనక తిక్కన. ఆ ముందు నన్నయ్య,
నన్నెచోడుడు.. పాల్కురికి ఇలా కవి పుంగవులు.. కళామూర్తులు కళ్లముందు
కదలాడతారు. అఆలు దిద్దించిన అమ్మలు, అమ్మమ్మలు, పంతుళ్లు, పంతులమ్మలు
ఒకరేమిటి చదువుతో ముడిపడిన ప్రతివారూ గుర్తుకొస్తారు. తెలుగు తల్లి, తర్వాత
వెలసిన తెలంగాణా తల్లి తదితర తల్లులందురూ మదిలో మెదులు తారు.
మల్లమ్మ
పతిభక్తి. రుద్రమ్మ భుజశక్తి, తిమ్మరుసు ధీయుక్తి..కృష్ణ రాయల కీర్తి..
చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. స్వాతంత్ర సంగ్రామం, జమీందారీ వ్యతిరేక
పోరాటం.. నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు అన్నీ మదిలో మెదులుతాయి.
ఇన్నిటిని కలిపి వుంచిన బంధం అక్షరం. తెలుగు అక్షరం. అందచందాల ఒంపుసొంపుల
అక్షరం. 56 అక్షరాలతో ప్రపంచంలో ఏ భాషా పదాన్నయినా రాయగల తెలుగు అక్షర సంపద
అనితర సాధ్యం. అరుదైన సంగీత గుణంతో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని
పిలిపించుకున్న తెలుగు కు ఆంధ్రం అనీ, తెనుగు అనీ తెనుంగు అనీ పర్యాయ
పదాలు. తెలుగు ప్రాతిపదికపై ఏర్పడిన భౌగోళిక విభాగాన్ని విభజించాలన్న
కోర్కెతో పాటే తెలుగు భాషలో తేడాలపైనా వివాదాలు నడుస్తున్నాయి గాని తెలుగు
ఔన్నత్యంపై భిన్నాభిప్రాయాలు లేవు.
ఇంతకూ ఈ తెలుగు ఎప్పుడు పుట్టింది?
దాని తొలి అడుగులేవి?
తెలుగు భాషను
తెనుగు తెలుగు తెనుంగు, తెనుగు అని వివిధ పేర్లతో పిలవడమే గాక ఆంధ్ర ఆంధ్రి
అనే నామాంతరాలు కూడా వున్నాయి. తెలుగు, ఆంధ్ర అని రెండు పేర్లు వాటికి
మళ్లీ ప్రత్యామ్నాయాలు వుండటాన్ని బట్టి ఈ భాషా పరిణామంలో అనేక దశలున్నాయని
అర్థమవుతుంది. ప్రాక్ చరిత్ర కాలంలో ప్రాచీన వ్యవసాయ జాతులు అంటే
తెలుగువాళ్లు/ తైలింగులు అయి వుంటారనీ, ఆంధ్రులు ఉత్తరాది నుంచి
దక్షిణాదికి తరలి వచ్చిన వాళ్లయి వుంటారని ఆయన భావన. ఈ రెండు జాతులు
మిళితమైనట్టే వారి భాషలు కూడా కలసి పోయి ఒకే భాష ఒకే ప్రజగా తయారై
వుంటారన్నారు. ఇలా కలసిపోయిన వీళ్లను భాషాపరంగా గాని సంస్కృతి పరంగా గాని
నిర్దిష్టంగా ఎత్తిచూపించే తేడాలేమీ కనిపించవు.ఆంధ్రులు తమతో పాటు వందలాది
ప్రాకృత పదాలతో సహా ఆర్య లక్షణాలను తీసుకొచ్చారట. ఆ విధంగానే తెలుగులో
తత్సమాలు (అంటే అదే అర్థం కలిగినవి), తద్బవాలు(అంటే దాన్నుంచి పుట్టినవి)
ఏర్పడ్డాయి. నాగము అంటే పాము కావడం తత్సమం, ఆర్య నుంచి అయ్య రావడం తద్భవం.
ఇలా వందలపదాలు వచ్చి చేరడం వల్ల తెలుగు భాష చాలా సుసంపన్నమైంది.
క్రీ.శ.మొదటి శతాబ్దం నుంచి నాణేల మీద రాసిన రాతల్లో తెలుగు కనిపిస్తుంది.
తద్భవ,తత్సమ దేశి మాటల మిశ్రమ భాష అంధక అని బౌద్ధులు అన్నారు. బౌద్ధ
మతాన్ని తప్పించి క్రమేణా వైదిక మతం లేదా బ్రాహ్మణ పౌరాణిక మతం వచ్చింది.
తెలుగు భాషమీద ప్రాకృత ప్రభావం కన్నా సంస్కృత ప్రభావం అధికమైంది. రచయితలు
అంతకు బౌద్ద యుగంలో పవిత్రంగా భావించిన పాళీ(ప్రాకృత) భాష స్థానాన్ని
సంస్కృతం ఆక్రమించింది. పాత శాసనాల్ని మార్చి మళ్లీ జారీ చేయడం
మొదలెట్టారు. ఇది ఎంత వరకూ పోయిందంటే నల్లమల శ్రీ పర్వతంగానూ, మరొకటి
మంగళగిరిగానూ, నల్లబెన్న కృష్ణవేణిగానూ, యనమదల మహిష శిరగానూ మారిపోయాయి!
అయితే ఈ చొరబాట్లన్నింటినీ తట్టుకుని పేర్లలో తెలుగు నిలిచి పోయింది. అంగి,
అంకి, పర్రు, కుర్రు, ఊరు వంటి మాటలన్నీ ఆ కోవకు చెందినవే.
లిపి కథాకమామీషు
ఇక
లిపి విషయానికి వస్తే భారత దేశంలోని ఇతర భాషల లాగానే తెలుగు లిపి కూడా
బ్రాహ్మీ లిపి నుంచి వచ్చింది. మొదట తెలుగు అక్షరాలు తక్కువ సంఖ్యలో
వుండేవని క్రీపూ, 3వ శతాబ్దినాటి భట్టిప్రోలు శాసనం చూస్తే తెలుస్తుంది.
800 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అంటే క్రీ.శ.5,6 శతాబ్దాల నాటికి విస్త్రతి
సంతరించుకున్నాయి. పదవ శతాబ్డం దాకా తెలుగు కన్నడ లిపులు ఒకటే విధంగా
వుండేవి. దాన్ని తెలుగు కన్నడ అనేవారట. తర్వాత నుంచి మారాయి. క్రీపూ. మొదటి
శతాబ్దిలో పాలించిన తొలి శాతవాహనుల కాలానికి తలకట్టు వచ్చి చేరింది.
అశోకుని కాలం నాటి శాసనాలలో క,గ,త వంటి రూపాలు కోసుగా వుండేవి. అ,క,ర వంటి
అక్షరాలు దిగువ అంచులు ఎడమకు వంగివుండేవి. ఇలాగే వివిధ రకాలైన అక్షరాలలో
వివిధ మార్పుల వచ్చాయి.ఇలా రకరకాలుగా వున్న తెలుగు అక్షరాలను నన్నయ్య
ప్రామాణికం చేశాడనీ అందుకే ఆయన వాగనుశాసనుడయ్యాడని అంటారు. తమాషా ఏమంటే ఈ
విషయంలో ఆయనకు సహకరించిన నారాయణభట్టు కన్నడిగుడు కావడం. నన్నయ్య వైదిక ధర్మ
పరిరక్షణ, రాజరాజనరేంద్రుని రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం మహాభారతం
వ్యాసభారతం ఆధారంగా మొదలెట్టాడు. అదే మొదటి బృహత్ కావ్యం అనే ఉద్దేశంతో
ఆది కవి అన్నారు. అయితే క్రమంగా అది శ్రుతి మించిన తతంగంగా తయారైంది.
ఆదికవి అనడం వల్ల ఆయనతోనే తెలుగు కావ్య రచన మొదలైందన్న పొరబాటు అబిప్రాయం
ఏర్పడింది. నిజానికి జానపదులు శ్రమ జీవులు గిరిజనులు తదితరులంతా అనేక విధాల
పాడుకుంటూనే వున్నారు. లిఖిత రచన, అందులోనూ బాగా పెద్దదైన కావ్యం మాత్రమే
గౌరవ యోగ్యమన్న పొరబాటు భావన ఆదికవి భజనకు దారి తీసింది. సోదికవులను
మరిపించేలా చేసింది. ఇదే ఉత్తరోత్తరా మన కొంప ముంచుతుందని అప్పట్లో అర్థం
కాలేదు. ప్రాచీన భాష హౌదాకు కనీసం రెండు వేల ఏళ్లు వుండాలని అన్నప్పుడు
ఆదికవి రాసింది వెయ్యేళ్లకిందటే కదా అన్న ప్రశ్న ఎదురైంది.
భిన్నాభిప్రాయాలు
పరబ్రహ్మశాస్త్రి
అభిప్రాయాలకు భిన్నమైన భావనలు కూడా వున్నాయి. ద్రవిడ భాషా కుటుంబానికి
చెందిన తెలుగూ తమిళమూ అటూ ఇటుగా రెండు వందల సంవత్సరాల తేడాతో పెరిగనవే
నంటారు. క్రీపూ 273 నాటి అశోకుడి శాసనాల్లోనే ఆంధ్రులు వీరులని వున్నప్పుడు
భాషా సాహిత్యాలు లేకుండా జరుగుతుందా అని వీరడుగుతారు. నన్నయ్యను ఆది కవి
అన్నంత మాత్రాన ఆయనకు ముందు బాష లేదనా? ఆయన తర్వాత వెయ్యేళ్లకు కూడా ఆయన
ప్రభావం వున్నట్టే తనకు ముందున్న వెయ్యేళ్ల ప్రభావం ఆయనపై వుండి వుండాలి
కదా అని తర్కిస్తారు. జివిపూర్ణచందు వంటివారైతే అసలు తెలుగు తమిళం కన్నా
ప్రాచీనమైనదని వాదిస్తారు. తమిళులైతే ప్రాణి పుట్టకముందే మొదటి గండశిలపైనే
తమిళ అక్షరం ఉందంటారు! అది ఎలా ఉన్నా భాషా చరిత్రను వారు బాగా పట్టుకోవాలి.
నన్నయ్య
దేశి కవితను సంసృత మార్గం పట్టించారన్న అభిప్రాయం వుంది.. తమిళ భాషలో సంగం
సాహిత్యం తొలిదశకు సంకేతంగా భావిస్తారు, అందులో ఒకటైన తొల్కాప్రియం లక్షణ
గ్రంథం. దాన్ని ఇటీవల శాబ్దికంగా రికార్డు చేయించారు. మరి ఆ కాలానికి
తెలుగులోనూ అలాటి గ్రంధాలు లేవని చెప్పగలమా? వున్నా దొరక్కుండా పోయే అవకాశం
లేదా? ప్రాచీన ఆధారాలను సేకరించాలంటే శాస్త్రీయ దృష్టి వుండాలి. తదేక
దీక్షతో పరిశీలించాలి. మనకు ఆ విధమైన దృష్టి లేకపోయిందన్నది నిజం. నాటి
సనాతన పండితులు రాజాస్థానాల్లోనే సాహిత్య ఉత్పత్తి వ్యుత్పత్తి దాగున్నాయని
అనుకున్నారు. శ్రమ జీవుల చమట పాటల్లో సరస్వతిని గుర్తించలేకపోయారు.
గుర్తించినా గౌరవించలేకపోయారు. ఆది కవులను కీర్తిస్తూ సోది కవులను
విస్మరించారు. తమిళులు కాపాడుకున్న సంగం సాహిత్యంలో కనిపించే పల్లె పదాల
వంటివి మన జానపదాల్లోనూ వున్నాయని పాల్కురికి సోమనాథుడు సోదాహరణంగా
వివరించాడు. ఆ పల్లె పాటలే కాదు, బౌద్ద జైన విశ్వాసాలకు సంబంధించిన
సాహిత్యం కూడా మనకు దక్కలేదు. తమిళంలో లభ్యమవుతున్న తొలి సాహిత్యమంతా చాలా
వరకూ జైనులదే. కనక తెలుగులో దాన్ని కాపాడుకోలేకపోవడం పెద్ద లోపంగా మారింది.
అదలా
వుంచి మళ్లీ ఆదికవి పద్దతికే వస్తే ఆరుద్ర తెలుగు సాహిత్య పరిణామాన్ని
బట్టి 12 యుగాలుగా విభజించారు(బాక్సు చూడండి) ఈ యుగ విభజన ప్రకారమే సమగ్ర
ఆంధ్ర సాహిత్యం రాశారు. గురజాడతో ఆధునిక భావన ప్రవేశించింది.
వ్యవహారిక భాషాసమరం
గురజాడ,
గిడుగు, కందుకూరి వీరేశలింగం వీరిని ఆధునిక తెలుగు వైతాళికులుగా ప్రజలు
గౌరవించారు. ఇందులో మొదటి ఇద్దరు భాషా సాహిత్య రంగాలలో కృషి చేసిన వారు
కాగా కందుకూరి సామాజిక రంగంలోనూ విజృంభించి పనిచేశారు. అయితే గురజాడ
విషయంలో సంస్కరణకు సాహిత్యం తోడైంది. ఇంకా చెప్పాలంటే సామాజిక సంస్కరణకు
సాహిత్యం దోహదపడాలంటే భాషా సంస్కరణ అవశ్యమని ఆయన గుర్తించారు. ప్రపంచంలోని
చాలా దేశాలలో వలెనే భారత దేశంలోనూ ఆంధ్రలోనూ కూడా భాషా సంస్కరణతోనే జాతీయ
భావాలు పొటమరించడం చూస్తాం. భాషను చాందస శక్తుల గుప్పిటి నుంచి తప్పించి
జనబాహుళ్యానికి అందుబాటులోకి తేవాలన్న తపనతో పోరాడిన ప్రజాస్వామిక శక్తులే
సమాజాన్ని కుదిపేశాయి. గురజాడ తన భావాలను స్పష్టంగానే ప్రకటించాడు.ఆయన
కన్యాశుల్కం నుంచి అసమ్మతి పత్రం వరకూ అన్నీ ఆ దిశలో సాగిన ప్రయత్నాలే.
ఇందుకు భిన్నంగా తెలుగు తక్కువ రకం భాష అనీ, అందులో రాయడం అవమానమనీ
పండితులు భావించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తన కుటుంబంలోనే ఎదురైన
అనుభవాన్ని గ్రంథస్తం చేశారు. అంతకన్నా ముందే వేమన వంటి మహాకవిని
గుర్తించకుండా తొక్కిపడితే విదేశీయుడైన బ్రౌన్ వెలుగులోకి తెచ్చాడు!
కందుకూరి
తన శిష్య బృందం సహాయంతో వ్యతిరేకులపై హోరాహోరి పోరాడి జయించారు. గురజాడకు
విజయనగరం రాజా అండ వుంది గనక సరిపోయింది. ఇక గిడుగు తనకు తానుగానే బాలకవి
శరణ్యము వంటి గ్రంథం రాసి పండితుల గర్వభంగం చేశాడు. కనక తెలుగు
నిలదొక్కుకోవడానికి చాలా పోరాటమే అవసరమైంది.ఇంత మహత్తర సేవ చేసిన వీరిని
గుర్తుంచుకున్నది స్వల్పం. అభ్యుదయ ఉద్యమాలు బలపడ్డాకనే మళ్లీ వీళ్ల
ప్రాధాన్యత పెరిగింది. కమ్యూనిస్టులు వీళ్లను గౌరవించడం సహించలేక కామ్రేడ్
వీరేశలింగం అంటూ గేళి చేయసాగారు. గురజాడ దేశభక్తి గీతం కమ్యూనిస్టులే
ప్రాచుర్యంలోకి తెచ్చారు. పల్లెటూళ్లలో యువజనసంఘాలు ఆ సాంస్కృతిక
వారసత్వాన్ని విస్త్రతంగా ప్రచారం చేశాయి. దానికి తగినట్టే కమ్యూనిస్టులు
వర్గ చైతన్య స్పోరకమైన భాష వాడుకలోకి తెచ్చారు. ప్రజాశక్తి వార్తలు వూరూరా
వ్యవసాయ కార్మికులను పోరాటోన్ముఖులను చేశాయి. ప్రజలు చుట్టూ కూచుని పత్రిక
చదివించుకోవడం సర్వసాదారణ దృశ్యమైంది. ఇది సహించలేక ప్రజాశక్తి ప్యాస్,
పెద్దబాలశిక్ష ఫెయిల్ అన్న ప్రచారం నడిచింది. ప్రజాస్వామిక వాదులు గనకే
కమ్యూనిస్టులు భాషా సంస్కరణకు అంత ప్రాధాన్యత నివ్వగలిగారు. ఈ వరవడిలోంచే
తర్వాత కాలంలో అభ్యుదయ కవులు ఉద్భవించారు. ఉత్తమోత్తమ కావ్యాలు
సృష్టించారు. శ్రీశ్రీ వంటి వారు నూతన యుగ కర్తలైనారు.
'కూర్తునా
ముత్యాల సరములు/ కూర్చుకుని తేటైన మాటలు అని గురజాడ అంటే శ్మశానాల వంటి
నిఘంటువులు దాటి చందస్సులు సర్ప పరిష్వంగాలు వీడి...' అని శ్రీశ్రీ
అన్నారు. ఏతావాతా ఉభయులూ భాషా సరళీకరణనూ భావాల పదునునూ నొక్కి చెప్పడం
గమనార్హం. ఈలోగా దేశంలోనూ నూతన భావాలు పొటమరిస్తున్నాయి. జమీందారీ వ్యతిరేక
పోరాటాలతో పాటే భూస్వామ్య భావజాలంపైనా తిరుగుబాటు బావుటాలు
ఎగుర్తున్నాయి.ఇలాటి పరిస్థితుల్లోనే వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం
కూడా ప్రారంభమైంది. మిగిలిన అనేక దుర్మార్గాలతో పాటు నిజాం నవాబు అత్యధిక
ప్రజలు మాట్లాడే తెలుగు భాషా వికాసానికి అవకాశం లేకుండా నిషేదాలు
విధించాడు.గ్రంథాలయాలు, పత్రికా నిర్వహణ కూడా నేరంగా చేశాడు. ఈ అణచివేతకు
ఆంక్షలకు వ్యతిరేకంగానే మొదట సంస్కరణోద్యమం మొదలై ఆ తర్వాత విప్లవ పోరాటంగా
విస్తరించింది. భాషా చైతన్యం ఏ విధంగా భావ విస్ఫోటనానికి దారి
తీస్తుందనేందుకు ఇది మరో ఉదాహరణ.
మాండలికాల సమస్య
ఉత్పత్తి
సాధనాలు, సామాజిక పరిస్థితులు మారినప్పుడల్లా భాష చర్చనీయం కావడం అసహజమేమీ
కాదు. ప్రవాహం లాటి భాషలో ప్రమాణాలు ఎప్పుడూ సాపేక్షమే. అత్యధిక జనానికి
అందుబాటులో ఉండటం, ఆమోదయోగ్యంగా ఉండటం, అభివృద్ధికి ఉపకరించేదిగా ఉండటం,
ఆధునీకరణ అవకాశాలు కలిగివుండటం ఇవే భాషా విధానంలో కీలకాంశాలు.
దురదృష్టవశాత్తూ భాష గురించిన చర్చలో తరచూ ఈ మౌలికాంశాలు
విస్మరించబడుతుంటాయి. ఇప్పటికీ బోధనా భాష, సాహిత్య భాష, మీడియా భాష, శాసన
భాష, వాడుక భాష వీటన్నిటినీ విడివిడిగానూ, ఉమ్మడిగా చూడటంలో పాటించవలసిన
సమగ్ర దృక్పథం చాలా మందిలో లోపిస్తుంటుంది. ఈనాటి మన వాదనలను బట్టి ఒకనాడు
వ్యవహార భాష వాదన చేసిన వారి చిత్తశుద్ధిని తప్పు పట్టనవసరం లేదు.
ఛాందసులకు వ్యతిరేకంగా జనసామాన్యం మేలుకోసమే వారు ఆ పని చేశారు. తెలుగుకు
ప్రామాణికత్వం లేదు అన్నప్పుడు ఉంది అని నిరూపించడానికి కృష్ణా గోదావరి
మండలం భాష ఎక్కువ ఆమోదయోగ్యంగా ఉందని గురజాడ, గిడుగు చెప్పారు. ఆ పరిస్థితి
రావడానికి చారిత్రిక కారణాలు కూడా గురజాడ చెప్పారు. ఆ నాటికి తెలంగాణ ఇంకా
నైజాం పాలనలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత యాభై ఏళ్ళలో మూడు ప్రాంతాల
ప్రజలూ అర్థం చేసుకుని ఆనందించగల తెలుగు రూపొందింది. కనుకనే పత్రికలు,
టీవీలు, సినిమాలు, వ్యాపారాలు, పెళ్ళి పేరంటాలు వగైరాలన్నీ నిరాటంకంగా
సాగిపోతున్నాయి. ఏ భాషా ప్రయోగమూ ప్రత్యేకించి గొప్పది కాదు. ఏదీ హీనమైనదీ
కాదు. కొందరి సంకుచితత్వాలు కొలబద్దలుగా తీసుకోనవసరంలేదు. అన్ని భాషలూ,
మాండలికాలు సమాజ పరిణామ క్రమంలో పెరిగినవే.
శ్రీపాదను,
రావిశాస్త్రిని, దాశరథి రంగాచార్యను, విద్వాన్ విశ్వంను సమానంగా
ఆస్వాదించవచ్చు. శ్రీరమణను, నామినిని, తెలిదేవర భానుమూర్తిని కూడా
అభినందించవచ్చు. నాజర్‌ను, గద్దర్‌ను ఏకకకాలంలో స్వీకరించవచ్చు. అందులో
ఎలాంటి అరమరికకూ ఆస్కారం లేదు. మాండలికంలో ఎవరైనా అభ్యంతరం పెట్టడానికి
కారణాలేవీ లేవు. ఏదైనా మాండలికంలో ఏదైనా మాట తెలియకపోతే తెలుసుకోవడం
కష్టమేమీ కాదు. అయితే మాండలికం వాడకమే పొరపాటని అన్నా, మాండలికమే సర్వస్వం
అన్నా అది వాస్తవికంగా ఉండదు. దీనికి సందర్భం, సమతుల్యత ఉండక తప్పదు. అది
ఎవరికి వారు పాటించవలసింది. వచ్చిందన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా
అని సినారె అద్భుతంగా చెప్పిన స్ఫూర్తి నిలుపుకోగలిగితే చాలు. ప్రాథమిక
విద్యా దశలో అక్షరాలు, పదాలు నేర్చుకోవడానికి పిల్లలకు పరిచితమైన భాష
ఉండాలని అన్ని పరిశోధనలూ చెబుతున్నాయి. అయితే పరిసరాల భాషలో పాఠ్య
పుస్తకాలు ఎన్ని తయారుచేయగలమనే ప్రశ్న ఒకటి ఉన్నా చర్చనే నిరాకరించడంలో
అర్థంలేదు. ఒక్క పుస్తకమే సక్రమంగా అందించలేని సర్కార్లు అన్నిరకాలైన
వైవిధ్య భరితమైన పుస్తకాలు అందించగలవని ఎవరూ నమ్మరు. కనీసం పాఠాల చివరలో
ప్రత్యామ్నాయ పదాలనైనా పొందుపరచవచ్చు.
ఇంగ్లీషు భ్రమలు - వాస్తవాలు
ఇంగ్లీషు
వల్ల తెలుగుకు ప్రమాదం ఉందా లేదా అనే చర్చ అప్రస్తుతం. అధికార భాషగా
తెలుగు స్థిరపడలేదనేది నిజం. ప్రపంచీకరణ దాడి ఏ ఒక్క అంశానికో పరిమితమైంది
కాదు. సామాజిక జీవితంలో అతి కీలకమైన భాష అందుకు మినహాయింపు కాదు. అయితే
ఇన్నేళ్ళుగా మన భాషా విధానం విఫలమవడానికి కారణాలు చాలా ఉన్నాయి.
'బ్యూరోక్రసీ' అందుకు అడ్డుపడుతున్నదనుకుంటే తిరిగి అదే 'బ్యూరాక్రటిక్'
పద్ధతుల్లో ఉత్తర్వుల ద్వారా అమలు చేయించలేము. మన భాషలో పాలన జరిగి తీరాలనే
చైతన్యం జనంలో పెంచాలి. ప్రజలు స్వీకరించేందుకు వీలైన భాషాభివృద్ధి
జరగాలి. ఆధునిక సామాజిక జీవితంలో ఉపయోగించే అనేకపదాలకు సముచితమైన
ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించకుండా ఆంగ్లాన్ని ఆడిపోసుకున్నంత మాత్రాన
ఒరిగేది శూన్యం. ఎనభై తొంభై ఏళ్ళ నాటి వ్యవహార భాష ప్రమాణాలు పరిస్థితులతో
పాటు మారుతూనే ఉన్నాయి. వాటిని సౌకర్యంగా సమీక్షించుకుని వాస్తవిక దృక్పథం
రూపొందించుకోవాలి. అయితే సాహిత్యంలోనూ, మీడియాలోనూ భాషా వైవిధ్యాన్ని
ఆదరిస్తూనే ఉన్నారు గనక బోధనా భాషను, పాలనా భాషను ముందు చక్కదిద్దుకోవాలి.
ఎందుకంటే చైతన్యం పెరగాలన్నా, జ్ఞానం విస్తరించాలన్నా అత్యధికులకు
అందుబాటులో ఉండే భాషా విధానం కావాలి. ఇంగ్లీషులో తప్ప తెలుగులో
మాట్లాడలేమని చెప్పడం అర్థరహితం.
సీతారాం ఏచూరి తెలుగువాడైనా
అత్యధిక కాలం రాష్ట్రం బయటే అత్యున్నత స్థాయిలో మసలిన వ్యక్తి. మొదట
తెలుగులో ఉపన్యాసం ఇవ్వాలంటే ఇబ్బంది పడేవారు. గత పదిహేనేళ్లలో సాధనతో
తెలుగులో జన రంజకంగా మాట్లాడుతున్నారు. సంక్లిష్టమైన సిద్ధాంత విషయాలను
కూడా అర్థమయ్యే విధంగా తెలుగులో మాట్లాడతాడు. బహుబాషావేత్త పివి
నరసింహారావు తెలుగులో మాట్లాడితే మహా మధురంగా ఉండేది. కాని మేధావి మిత్రులు
చాలా మంది తెలుగులో సరిగ్గా 'ఎక్స్‌ప్రెస్' చేయలేమని బాధపడిపోతుంటారు.
రాజు-
పేదలో రేలంగి జేబులో బొమ్మా అని బొమ్మ పెట్టుకుని తిరుగుతుంటాడు. అది
ఉంటేనే తాను పోట్లాడగలనని అతని నమ్మకం. ఒకసారి పోట్లాడిన తర్వాత చూస్తే
బొమ్మ బయటేపడి ఉంటుంది. అది లేకున్నా పోట్లాడగలనన్న మాట అనుకుంటాడప్పుడు.
చాలా మంది విద్యాధికులు లేదా ఆధునికులు ఆంగ్లం విషయంలో ఇలాగే
పొరబడుతున్నారా? ఇంగ్లీషు వస్తే విశ్వ విజేతలం కాగలమనీ అనుకుంటున్నారా?
ఇంగ్లాండు పక్కనే గల చాలా దేశాల్లో ఇంగ్లీషును పట్టించుకోరని వారికి
తెలుసా? నిన్నటి, నేటి సామ్రాజ్యవాద కేంద్రాలలోనూ, వాటి వలసాధిపత్యం సాగిన
రాజ్యాలలోనూ తప్ప మిగిలిన చోట్ల ఆంగ్లం పొంగిపొర్లదు. ప్రజలపై పెత్తనం
చేయడానికి భావాలు మాత్రమే కాక భాష కూడా వారికి తెలియనిదైతే పరాన్న భుక్కు
పాలకులకు చాలా మంచిది. ఈ దేశపు సామాన్య ప్రజలు ఏనాడూ మాట్లాడని సంస్కృత
భాషలో సకల భారతీయ శాస్త్రాలు రూపొందడానికి కూడా అదే కారణం. సరిహద్దులు
సముద్రాలు దాటి వచ్చిన ఇంగ్లీషు వారికి అది మరింతగా వర్తిస్తుంది. ఇతర
దేశాలను ఆక్రమించి సంపదలు కొల్లగొట్టి పద సంపదను కూడా ఇతర భాషల నుంచి ఎరువు
తెచ్చుకోవడం వల్ల ఇంగ్లీషు పెరిగింది తప్ప అదేదో దైవత భాష కాదు.
చారిత్రకంగా లభించిన లేదా కబళించిన సౌలభ్యం వల్ల ఇంగ్లీషుకు ప్రత్యేక
స్థానం ఉన్నమాట నిజం. కాని అది ఇతర భాషలకు శాపం కాకూడదు. ప్రత్యేకించి
ప్రపంచీకరణలో మిగిలిన అన్ని రంగాలతోపాటు భాషాపరంగానూ వర్థమాన సమాజాలు చాలా
దెబ్బతిని పోతున్నాయని గుర్తించక తప్పదు. అప్పుడు భాషాపరమైన బానిసత్వంలో
మునిగితేలడం మరింత బాధాకరమనిపిస్తుంది. మేధావుల గోష్టుల్లో, విద్యా
సంబంధమైన పండిత సభల్లో ఇంగ్లీషు వాడొచ్చు. రాయొచ్చు కూడా. కాని రోజువారీ
విషయాలకు, భావోద్వేగాలకు కూడా ఇంగ్లీషేనా ? చెల్లుబాటవుతుందనే అహం తప్ప!
ఇంత
ప్రాచీనత కలిగిన భాషలో సినిమాల్లో ప్రేమను వ్యక్తీకరించడానికి 'ఐ లవ్ యూ'
తప్ప అందమైన మాటే దొరకదా? ఎవరైనా కోపం వస్తే బాధ కలిగితే మాతృభాషలోకి
మారిపోతారని కథలూ, అనుభవాలూ చెబుతున్నాయి. ఐన్ స్టీన్ ఏదైనా క్లిష్టమైన
అంశం వివరించాలంటే జర్మన్‌లోకి వెళ్లేవాడట. తెనాలి రామకృష్ణ కథలోనూ
బహుభాషలు మాట్లాడుతూ సవాలు చేసిన వారిని ఓడించడానికి కాలు తొక్కి
కనుక్కొంటాడు. కాని మన సినిమాలు, సీరియల్సులో మాత్రం బాగా కోపం వచ్చిన వారు
నో అని అరవడం, గెటౌట్ అనడం పరాకాష్టగా చూపుతారు. తెలుగులో మాట్లాడితే
కొట్టే కుటుంబాలు, విద్యాలయాలు నిజంగా ఉన్నాయి. తమను చులకనగా చూస్తున్నారని
సందేహం వచ్చిన వారెవరైనా ఇంగ్లీషు ఉపయోగించి తన సత్తా చూపాలనుకుంటాడు.
మూడు గంటలైంది అని తెలుగులో జవాబు చెబితే తక్కువ అంచనా వేశామని
చిన్నబుచ్చుకుంటారు. ఇంగ్లీషులో మాట్లాడ్డం రాదు కనక లేనిపోని పరిమితులు
సృష్టించుకుని కుమిలిపోయే అమాయకులు ఎంతమందో. దాన్ని సొమ్ము చేసుకోవడానికి
తామర తంపరగా వెలిసిన రకరకాల కోర్సులు! ఉభయ భాషా ప్రవీణులు కాకపోగా ఉభయ భాషా
భ్రష్టులౌతున్న వైనాలు.
భాష ఏదైనా ఒక సాధనం మాత్రమే. అందులో
ఎక్కువ తక్కువలు ఉండవు. సాపేక్ష వికాసాలు, సమస్యలూ మాత్రమే ఉంటాయి.
తెలుగును ఆధునీకరించుకోవలసిన అవసరం చాలా వుంది. వీరేశలింగంతో సహా చాలామంది
పెద్దలు వివిధ శాస్త్రాల అనువాదాలకు ఎంతో కృషి చేశారు. బుద్ధి జీవులైన వారు
మనసు పెట్టి మాట్లాడకుండా, మాటలు సృష్టించకుండా ఏ భాషా పెరగదు. తెలుగులో ఆ
విధమైన అర్థవంతమైన కృషి ఆగిపోయిందా అని సందేహం కలుగుతుంది. సినిమావాళ్లు,
కవులు, రచయితలు, హడావుడి సాహిత్యకారులైన పాత్రికేయులు, అనువాదకులు
అనివార్యంగా కొంత కృషి చేస్తున్నారు. జనం పత్రికా భాషను ఉపయోగిస్తున్నారు.
కాని మీడియా, కవరేజి, రిపోర్టింగు, న్యూస్ బ్రేకింగ్, ఇంటర్వ్యూ, ఫీచర్
వంటి పత్రికా సంబంధమైన పదాలకే సరైన తెలుగు ఇంతవరకూ లేదు. కాని శాస్త్ర
సామాజిక సాంకేతిక కోణాల నుంచి తెలుగు భాష ఆధునీకరణ అవసరం అలాగే ఉంది.
దాన్ని మొదట్లో ఛాందసులకు అప్పగించడంవల్ల మేలు కన్నాకీడే జరిగింది.
కుదిరితే తెలుగు, లేకపోతే ఇంగ్లీషే ఖాయం చేస్తే చాలా మంచిది. కాలానుగుణమైన
మార్పే భాషకు ప్రాణవాయువు. భాష పేరిట జపం చేసే వాళ్లలోనూ తిరోగాములున్నారు.
నిజమైన భాషా పోషకులూ ప్రజలే. దాన్ని వారికే అందించాలి. ఉపయోగకరంగా
మార్చాలి. పౌర జీవితంలో అదో అంశం కావాలి. తమిళనాడులో, బెంగాలులో, కేరళలో
భాషా సంస్కృతుల గురించిన చైతన్యం ఎక్కువగా ఉందంటే అలాటి కృషే కారణం. అదే
జరిగితే అవసరం లేనప్పుడు పరభాషలో సగర్వంగా ప్రసంగించేందుకు సాహసించరు.
అమ్మను మమ్మీ అని, అన్నాన్ని రైస్ అని పిలవరు!
Comments
Post a Comment